vijayasai reddy: వెంకయ్యనాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న వైనం!
- కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుజనా మాట్లాడారు
- ఇది రాజ్యాంగానికి విరుద్ధం
- రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వెంకయ్య... నిబంధనలను అమలు చేయలేదు
- వెంకయ్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ను లేవనెత్తారు. కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సుజనా... సభలో దానితో విభేదించడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్ నిర్ణయంతో విభేదించవచ్చని అన్నారు. మంత్రిగా కొనసాగుతూనే కేబినెట్ నిర్ణయంతో ఎలా విభేదిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, కేంద్రమంత్రులకు సలహాలు ఇచ్చే అధికారం మరొక కేంద్ర మంత్రికి ఉంటుందని, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుజనా చౌదరి మాట్లాడలేదని చెప్పారు. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సీట్లో కూర్చోవాలని విజయసాయికి సూచించారు.
అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వెంకయ్య తీరును తప్పుబట్టారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై రాజ్యసభ ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే... నిబంధనలను అమలు చేయకపోతే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న చర్యను ఛైర్మన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.