Andhra Pradesh: వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక మనకు ఇబ్బందులు వస్తున్నాయి!: ఎంపీ టీజీ వెంకటేశ్
- మేము మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాం
- ఢిల్లీలో కేంద్ర మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కూడా సహకరించారు
- ఢిల్లీలో వెంకయ్య నాయుడు మనకు పెద్ద దిక్కుగా ఉండేవారు
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక ప్రస్తుతం ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదని కొందరు అంటున్నారని, కానీ, తాము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నామని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఆయన కూడా సహకరించారని, ఢిల్లీలో ఆయన మనకు పెద్ద దిక్కుగా ఉండేవారని అన్నారు.
అయితే, వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక ప్రస్తుతం ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. తాము రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీలు బంద్కు పిలుపునిస్తే.. బంద్ నిర్వహించే దాంట్లో మాత్రం టీడీపీ నేతలే ముందున్నారని టీజీవీ అన్నారు. ఏపీలో నిర్వహించే నిరసనల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం జెండాలే కనపడుతున్నాయని, పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు పోరాడాలనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు.