sivaprasad: లోక్ సభలో ఢమరుకం మోగించిన ఎంపీ శివప్రసాద్.. టీడీపీ ఎంపీలను ఛాంబర్ కు ఆహ్వానించిన స్పీకర్!
- పార్లమెంటులో కొనసాగుతున్న ఎంపీల ఆందోళన
- ఢమరుకం మోగిస్తూ, పాటలు పాడుతూ శివప్రసాద్ నిరసన
- సిబ్బందికి ఇబ్బంది కలిగించవద్దని కోరిన స్పీకర్
వినూత్నశైలిలో నిరసన తెలపడంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు మించినవారు మరెవరూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వతహాగా సినీ నటుడు కావడంతో, తన నటనా చాతుర్యాన్ని నిరసన కార్యక్రమాల్లో సైతం ప్రదర్శిస్తుంటారు. ఈరోజు లోక్ సభలో టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ ఢమరుకం మోగిస్తూ హల్ చల్ చేశారు. ఎంపీలంతా విభజన హామీలను నినదిస్తూ... 'గోవిందా.. గోవిందా' అంటూ నిరసన చేపట్టారు. ఏపీ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడతారని మంత్రి అనంతకుమార్ చెబుతున్నా... ఎంపీలు పట్టించుకోలేదు. మరోసారి, నిమ్మల కిష్టప్ప ఢమరుకం మోగించగా... శివప్రసాద్ పాట పాడుతూ నిరసన తెలిపారు.
సభ వాయిదాకు ముందు టీడీపీ ఎంపీలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తన ఛాంబర్ కు ఆహ్వానించారు. వెల్ లో నిరసన చేపట్టవద్దని, అక్కడ ఉండే సిబ్బందికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. అయితే, స్పీకర్ ఛాంబర్ లోకి వెళ్లేందుకు శివప్రసాద్ నిరాకరించారు. మరోవైపు, స్పీకర్ తో సమావేశం ముగిసిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు.