Andhra Pradesh: టీడీపీ ఎంపీల ప్రశ్నలకు ప్రధాని సిగ్గుతో తలదించుకోవాలి: బోండా ఉమ
- ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదంటూ కేంద్రం మోసం చేస్తోంది
- 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను 2027 వరకు ఎలా పొడిగించింది?
- ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ ప్రకటించాల్సిందే: ఉమ డిమాండ్
పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ప్రశ్నలకు ప్రధాని మోదీ సహా బీజేపీ ఎంపీలందరూ సిగ్గుతో తలదించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ ఘాటుగా విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతూ కేంద్రం మోసం చేస్తోందని మండిపడ్డారు. 2017 తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకూ ఉండదన్న కేంద్ర ప్రభుత్వం, పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను 2027 వరకు ఎలా పొడిగించిందని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, మంత్రి జవహర్ మాట్లాడుతూ, బీజేపీతో ఉన్న మిత్రబంధం కోసమే నాలుగేళ్లు ఓపిక పట్టామని అన్నారు. అధికారం కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవమే తమకు ముఖ్యమని, ఎంపీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతున్నామని అన్నారు. ఆంధ్రుల కోపానికి కాంగ్రెస్ పార్టీ బలైందని, తమ ప్రజల మనోభావాలను బీజేపీ దెబ్బతీస్తోందని మండిపడ్డ ఆయన, వైసీపీ అధినేత జగన్ పైనా విమర్శలు గుప్పించారు. జగన్ ఓ అజ్ఞానని, తమపై ఆయన చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.