Andhra Pradesh: గ్రామాలవారీ వాటర్ ఆడిట్, బడ్జెటింగ్ పై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి : ఏపీ సీఎస్ దినేష్
- వాటర్ ఆడిట్, వాటర్ బడ్జెటింగ్ అంశంపై సమీక్ష
- సమీక్షలో పాల్గొన్న పలు శాఖ అధికారులు
- ఏ మేరకు నీటి అవసరం ఉందనే దానిపై ఒక శాస్త్రీయ విధానంలో లెక్కించాలి
- ఆపై ఆడిట్, బడ్జెటింగ్ చేయాలి : దినేష్ కుమార్
రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ బడ్జెటింగ్ చేసేందుకు వీలుగా ఈ నెలాఖరులోగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వాటర్ ఆడిట్, వాటర్ బడ్జెటింగ్ అంశంపై వెలగపూడి సచివాలయంలో ఈరోజు సమీక్షించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, భూగర్భ జలవనరులు తదితర శాఖల అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఏడాది కాలంలో గ్రామ పంచాయితీ పరిధిలోని చెరువులు, రిజర్వాయర్లు, బావులు వంటి ఇతర నీటి సోర్సుల ద్వారా లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకు, పశు పక్ష్యాదుల అవసరాలకు, వ్యవసాయ, పారిశ్రామిక వంటి స్థానిక అవసరాలకు ఎంత మేరకు అవసరం ఉంటుందనేది ఒక శాస్త్రీయ విధానంలో లెక్కించి ఆడిట్, బడ్జెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రకియను చేపట్టేందుకు ఆ గ్రామం పరిధిలో ఏడాదిలో ఎంత వర్షపాతం పడుతుందో, ఆ నీటిని చెక్క్ డ్యామ్ లు వంటి నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని చెరువులు, రిజర్వాయర్లు, బావులు వంటి నీటి వనరుల్లోకి వీటిని మళ్లించి ఏవిధంగా సంరక్షించు కుంటున్నామనేది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
అలాగే, వర్షపు నీటిని భూమిలో ఇంకే విధంగా చేసి ఆ గ్రామం పరిధిలో భూగర్భ జలమట్టాన్ని ఎంత వరకూ పెంపొందించామనేది కూడా పరిగణనలోకి తీసుకుని వాటర్ బడ్జెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న గ్రామాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అన్ని గ్రామాల్లో బడ్జెటింగ్ చేపట్టేందుకు వీలుగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఈ నెలాఖరులోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ నిర్వహణలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామాలవారీగా వాటర్ ఆడిట్, వాటర్ బడ్జెట్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు గాను వెంటనే ఆయా గ్రామాలవారీగా నీటి లభ్యత వివరాలను నిర్దేశిత నమూనా నివేదిక ద్వారా త్వరితగతిన సేకరించాలని చెప్పారు. నీటి సంరక్షణ చర్యలకు గాను ప్రస్తుతం అమలు చేస్తున్న నీరు-చెట్టు పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాథిహామీ పథకం నిధులను చెక్ డ్యామ్ లు, పెర్కులేషన్ ట్యాంకులు వంటి వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలకు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదే విధంగా, లభ్యమయ్యే నీటిని ఏ విధంగా సంరక్షించుకుని స్థానిక అవసరాలకు ఎంత సమర్ధవంతంగా ఏడాది పొడవునా ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై గ్రామస్థుల్లో పూర్తి అవగాహన కలిగించడంతోపాటు ఈ ప్రక్రియలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే ఏడాదిలోగా గ్రామాలవారీ వాటర్ ఆడిట్, వాటర్ బడ్జెటింగ్ ప్రణాళికను అమలు చేసేందుకు వీలుగా తగిన కార్యచరణ ప్రణాళికను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవిధమైన ప్రణాళికలను అమలు చేసిన నాడు గ్రామాల్లో ఏడాది పొడవునా నీటి లభ్యతను ఉంటుందని, అంతేగాక, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భాల్లో కూడా నీటికి ఇబ్బంది లేకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభుషణ్ కుమార్ మాట్లాడుతూ, వాటర్ బడ్జెట్, వాటర్ ఆడిటింగ్ కు సంబంధించి జలవనరుల శాఖ ద్వారా ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజిమెంట్ సిస్టమ్ (ఏపీడబ్ల్యుఆర్ఐఎంఎస్)అనే ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించామని తెలిపారు. ఈ వెబ్ సైట్ లో బేసిన్, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని వివిధ రిజర్వాయర్లు, మైనర్ ట్యాంకుల్లో నీటి లభ్యత, భూగర్భ జలాలు, సాయిల్ మాయిశ్చర్, వర్షపునీటి పారుదల, నీటి ఆవిరి తదితర వివరాలకు సంబంధించిన సాటిలైట్ డేటాను అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ విధానం ద్వారా ఎక్కడెక్కడ నీటి లభ్యత ఉందనేది ఎప్పటికప్పుడు తెలియజేయడంతోపాటు ఎక్కడెక్కడ నీటికి ఇబ్బందులు రానున్నాయనేది కుడా ముందుగానే తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కె.జవహర్ రెడ్డి మాట్లాడుతూ, వాటర్ బడ్జెట్ కింద గ్రామ పంచాయితీ యూనిట్ గా చేసుకుని ఆ గ్రామ పంచాయితీ పరిధిలో ఏడాది కాలానికి ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం, బ్యాలెన్స్ రన్ ఆఫ్ వాటర్, కావాల్సిన నీటి అవసరాల వివరాలను తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అంతేగాక ఆ గ్రామ పంచాయితీ పరిధిలోని మిగులు వర్షపాతం రన్ ఆఫ్ ను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలమట్టం 1 5మీటర్లు, 9-15 మీటర్ల కంటే తక్కువగా ఉన్న గ్రామాల్లో కొత్తగా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేపట్టేందుకు తగిన ప్రణాళికలను అమలు చేసేందుకు కృషి చేయనునున్నట్టు వివరించారు.
2017-18 ఏడాదికి గాను వాటర్ బడ్జెట్ కు సంబంధించి రాష్ట్రంలోని 12 వేల 918 గ్రామ పంచాయితీలకుగాను ఇప్పటికే 12 వేల 815 పంచాయితీల వివరాలను అప్ లోడ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వాటర్ హార్వేస్టింగ్ నిర్మాణాలు 230 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలిగి ఉండగా భవిష్యత్తులో 1127 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.