rammohan naidu: జైట్లీ ప్రసంగంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం.. ఇక ఓ నిర్ణయం తీసుకుంటాం: ఎంపీలు కేశినేని, రామ్మోహన్
- గత బడ్జెట్ల అనంతరం ఏపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు కూడా అవే
- మా పోరాటాన్ని గుర్తించలేదు
- మమ్మల్ని చిన్న చూపు చూశారు
- చంద్రబాబుతో చర్చిస్తాం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎటువంటి నిర్దిష్ట ప్రకటన చేయని నేపథ్యంలో టీడీపీ ఎంపీలు మండిపడుతున్నారు. ఏపీకి సాయం చేస్తున్నామని, ఇంకా చేస్తామని గతంలో చెప్పినట్లుగానే జైట్లీ మళ్లీ రొటీన్ వ్యాఖ్యలు చేస్తూ చేసిన ప్రసంగం తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు. అదనపు నిధులు, ఈఏపీలపై స్పష్టత ఇవ్వని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాసేపట్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జైట్లీ ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారని చాలా ఎదురు చూశామని, ఆయన ఎటువంటి స్పష్టతతో కూడిన ప్రకటన చేయలేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని తాము అనుకోవడం లేదని, ఇక అంతా అయిపోయిందని భావిస్తున్నామని తెలిపారు.
తాము మిత్రపక్షంలో ఉన్నప్పటికీ, నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ జైట్లీ సరైన ప్రకటన చేయలేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. గత బడ్జెట్ల అనంతరం ఏపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, ఇప్పుడు కూడా అవే వ్యాఖ్యలు చేశారని, తమ పోరాటాన్ని గుర్తించలేదని , తమను చిన్న చూపు చూశారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జైట్లీ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.