BJP: 2019 లోగా ‘పోలవరం’ పూర్తి చేయడం మా బాధ్యత: ఏపీ నేతలతో నితిన్ గడ్కరీ
- గడ్కరీని కలిసిని మంత్రి కామినేని, బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజు
- కొల్లేరు సమస్యపై ఉపరాష్ట్రపతిని, కేంద్ర పర్యావరణ మంత్రినీ కలిసిన నేతలు
- ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్న గడ్కరీ
పోలవరం ప్రాజెక్టును 2019 లోగా పూర్తి చేయడం తమ బాధ్యతని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోమారు స్పష్టం చేశారు. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు ఢిల్లీలో నితిన్ గడ్కరీని ఈరోజు కలిశారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కు నిధులు, జాతీయ రహదారులు ఇచ్చామని చెప్పారు.
కాగా, కొల్లేరు సమస్య పరిష్కారం కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ లను వారు కలిశారు. ఈ విషయమై మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ, నేషనల్ బోర్డు వైల్డ్ లైఫ్ సమావేశం మార్చి మొదటివారంలో జరగనుందని, కేంద్రం వేసిన ఎక్స్ పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదిక, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు.
పార్లమెంట్ ప్రాంగణంలో కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కొల్లేరు సమస్యపై కేంద్రానికి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని, ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నత అధికారులను కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎక్స్ పర్ట్స్ కమిటీ సమర్పించిన నివేదికలు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల, కొల్లేరు సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతూ వెంకయ్య నాయుడు, హర్షవర్థన్, ఫారెస్ట్ డి.జి సిద్ధాంత దాస్, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సి.కె మిశ్రా, ఉన్నతాధికారులను కలిసి చర్చించినట్లు తెలిపారు. పర్యావరణానికి ఆటంకం కలగకుండా కొల్లేరు సమస్యను పరిష్కరించాలని వెంకయ్యనాయుడు సూచించినట్లు పేర్కొన్నారు.