PM Modi: ప్రధాని మోదీ చారిత్రక పాలస్తీనా పర్యటన రేపే.. ఆరోగ్య, మౌలిక వసతుల కల్పనపై దృష్టి
- చారిత్రక పర్యటనకు సిద్ధమైన మోదీ
- ఆ దేశంతో పలు ఒప్పందాలు
- పాలస్తీనా ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై మోదీ దృష్టి
భారత ప్రధాని నరేంద్రమోదీ రేపు (శనివారం) పాలస్తీనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశానికి మద్దతుతోపాటు పలు వరాలు ప్రకటించనున్నారు. రమల్లాలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పర్యటన వెనక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని చెబుతున్నారు. ఆ దేశానికి ప్రేమపూర్వకమైన మద్దతు అందించేందుకు, పాలస్తీనాకు తామున్నామని భరోసా ఇచ్చేందుకే మోదీ వెళ్తున్నట్టు చెబుతున్నారు. అలాగే విద్య, వైద్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగే అవకాశం ఉంది.
మోదీ తన పర్యటనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెపాసిటీ బిల్డింగ్పై దృష్టి సారించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయి విద్య, వైద్యానికి దూరంగా ఉన్న పాలస్తీనా ప్రజలకు అవి అందించాలన్న పట్టుదలతో మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. జెరూసెలంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా ప్రకటించిన తర్వాత దీనిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితో భారత్ ఓటేసింది. అంతేకాదు, తాము ఏ వైపు ఉంటామో తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రధాని పాలస్తీనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.