lasit malinga: నేనింకా కుర్రాడిని కాను...రిటైర్మెంట్ ప్రకటిస్తా: మలింగ
- నా వయసు 34 ఏళ్లు నేనేమీ యువకుడ్ని కాదుకదా
- ప్రతి ఆటగాడు ఏదో ఒకరోజు ఆటకు దూరం కావాల్సిందే
- ముంబై ఇండియన్స్ కు కోచ్ గా రావడం ఆనందంగా ఉంది
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని శ్రీలంక పేసర్ లసిత్ మలింగ చెప్పాడు. స్విట్జర్లాండ్ లోని సెయింట్ మోరిస్ లో వెటరన్ ఆటగాళ్లతో కలిసి ఐస్ క్రికెట్ ఆడుతున్న సందర్భంగా మలింగ మాట్లాడుతూ, క్రికెట్ కు దూరం అయ్యేందుకు మానసికంగా సిద్ధమవుతున్నానని అన్నాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడడం గురించి పెద్దగా ఆలోచించడం లేదని అన్నాడు. అంతకంటే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పాడు. క్రికెటర్లంతా ఏదో ఒక రోజు ఆటకు దూరం కావల్సిన వారేనని మలింగ వేదాంతం వల్లెవేశాడు.
తన రిటైర్మెంట్ నిర్ణయంపై శ్రీలంక క్రికెట్ బోర్డుతో ఇంకా మాట్లాడలేదని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు శరీరం ఎంతమేరకు సహకరిస్తుందో చూడాలని పేర్కొన్నాడు. ఐపీఎల్ లో కూడా తన కెరీర్ ముగిసిందని చెప్పాడు. ముంబై ఇండియన్స్ కోచ్ గా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని చెప్పాడు. ఐపీఎల్ లో ముంబై తరపున మళ్లీ ఆడాలని మాత్రం కోరుకోవడం లేదని తెలిపాడు. వేలానికి ముందే ముంబై ఇండియన్స్ యాజమాన్యం తనతో మాట్లాడిందని చెప్పాడు. వచ్చే మూడేళ్ల కోసం జట్టును తయారు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. తన వయసు 34 ఏళ్లన్న మలింగ, తానేమీ యువకుడ్ని కాదుకదా? అని అన్నాడు.