Lok Sabha: అమరావతికి మెట్రో లేదు: స్పష్టంగా చెప్పిన కేంద్రం
- వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం
- ఆ ప్రతిపాదనేదీ తమ వద్ద లేదన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
- మాతృ వందనం అమలులో 19వ స్థానంలో ఏపీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి మెట్రో లేదా లైట్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సందర్భంగా వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం ఇచ్చిన గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో మెట్రో ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచనే లేదని తెలిపారు.
విజయసాయి అడిగిన మరో ప్రశ్నకు మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమాధానం ఇస్తూ, మాతృ వందనం పథకంలో ఏపీ 19వ స్థానంలో ఉందని, జార్ఖండ్, చత్తీస్ గఢ్ ల కన్నా దిగువన ఉందని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకూ ఏపీలో ఈ పథకం కింద కేవలం 2,352 మంది మాత్రమే ప్రయోజనాలను పొందారని వెల్లడించారు.
ఇక మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అజయ్ తమ్తా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, చీరాల పట్టు చీరలకు జియో ట్యాగింగ్ ప్రతిపాదన ఏదీ రాష్ట్రం నుంచి తమకు రాలేదని వెల్లడించారు.