Chandrababu: ఎన్టీఆర్ ను దింపినప్పుడు చూపిన ధైర్యంలో పదో వంతును ఇప్పుడు చంద్రబాబు చూపినా మోదీ సర్కారు నాశనమే:: ఉండవల్లి
- పార్లమెంట్ లో మోదీ సర్కారుకు బలం లేదు
- చాలా మందికి మోదీపై నమ్మకం పోయింది
- రాజీనామాలకు ఇదే సరైన సమయం
- ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించండి
- చంద్రబాబుకు ఉండవల్లి సలహా
వైస్రాయ్ హోటల్ గా రాజకీయాలు నడిపి, ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపిన సమయంలో చంద్రబాబునాయుడు చూపించిన ధైర్యంలో పదోవంతును ఇప్పుడు ప్రదర్శించినా నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ లైవ్ లో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ లో బీజేపీకి పూర్తి బలం లేదని గుర్తు చేశారు. ఇప్పటికే శతృఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా తదితరులు గ్రూపులు పెట్టుకున్నారని, శివసేన వంటి పార్టీలు బీజేపీకి దూరమయ్యాయని, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత చాలామందికి మోదీపై నమ్మకం పోయిందని తెలిపారు.
రాష్ట్ర డిమాండ్లను సాధించుకునే క్రమంలో మరింత ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయమని సూచించారు. రాజస్థాన్ లో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను కోల్పోయిన తరువాత బీజేపీ ముందస్తు ఎన్నికల ఆలోచనకు కూడా దూరమైందని, చంద్రబాబు తన ముందున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెంటనే ఎన్డీయే భాగస్వామిగా తప్పుకుని, కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలని ఉండవల్లి సలహా ఇచ్చారు. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో తప్పంతా కాంగ్రెస్ దేనని చూపిస్తున్న మోదీ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తప్పు కాంగ్రెస్ పార్టీది అయితే, ఈ మూడున్నరేళ్లలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.