Undavalli Arunkumar: జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఏం జరిగిందో తెలియదా? ఇప్పుడు చంద్రబాబు వెళ్లినా అంతే... క్లీన్ స్వీప్ ఖాయం: ఉండవల్లి
- జైలుకు పంపుతారన్న భయం ఎందుకు?
- జైలుకు వెళితే ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది
- వైఎస్ జగన్ విషయంలో అదే జరిగింది
- కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి
ఓటుకు నోటు కేసులో తనను అరెస్ట్ చేసి జైలులో పెడతారన్న భయం చంద్రబాబునాయుడిలో ఎందుకు ఉందో తనకు అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన ఉద్దేశం ప్రకారం ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లేంత పెద్ద తప్పేమీ చేయలేదని అన్నారు. ఒకవేళ కేంద్రం కక్షసాధింపు చర్యలు చేపట్టి, జైలుకు పంపించినా, బాధపడాల్సిన అవసరం లేదన్నారు.
చంద్రబాబును జైలుకు పంపితే, ప్రజలు చూస్తూ ఊరుకోబోరని, ఆయనపై ఓట్ల రూపంలో తమ సానుభూతిని చూపిస్తారని అన్నారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితే ఏర్పడితే, టీడీపీ మరింత మెజారిటీతో అధిక సీట్లలో గెలుస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
మోదీ సర్కారుకు లోక్ సభలో మెజారిటీ లేదంటూ లెక్కలు చెప్పిన ఉండవల్లి, రాజస్థాన్ లో రెండు సీట్లను పోగొట్టుకున్న తరువాత బీజేపీకి 280 సీట్లు ఉన్నాయని గుర్తు చేస్తూ, యశ్వంత్ సిన్హా, శతృఘ్నసిన్హాల కూటమిలో 8 మంది ఉన్నారని, చాలామంది ఎదురుతిరిగే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇటీవల అకాలీదళ్, శివసేన విత్ డ్రా అయ్యాయని, టీడీపీ కూడా మద్దతు విరమిస్తే, మోదీ వెంట నిలిచిన నితీశ్ వంటి వారు కూడా ఆలోచనలో పడతారని చెప్పారు.