Undavalli Arun Kumar: వెల్ లో నిలబడితే ఏం ప్రయోజనం... మేమేం సాధించామో చూడలేదా?: ఉండవల్లి అరుణ్ కుమార్
- మిత్రపక్షంగా ఉన్నంతకాలం హామీలు అమలు కావు
- మంత్రులతో రాజీనామా చేయిస్తేనే ప్రయోజనం
- నినాదాలు చేస్తుంటే డిమాండ్లు పరిష్కారం కావు
- కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి
లోక్ సభ, రాజ్యసభల్లో వెల్ లో నిలబడి నినాదాలు చేస్తే, ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, బీజేపీకి మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించినంత కాలం, ఏ విభజన హామీ కూడా అమలు కాబోదని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ లైవ్ డిస్కషన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నేడు తొలివిడత బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజని గుర్తు చేస్తూ, ఇవాళే కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలని సలహా ఇచ్చారు.
ఆపై తదుపరి సమావేశాల నాటికి తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు స్పీకర్ కు లేఖ సమర్పించాలని, ఆపై టీడీపీ సభ్యులకు పార్లమెంట్ లో కూర్చునేందుకు విడిగా సీట్లను ఏర్పాటు చేస్తారని, ఆపై పోరాడితే హామీలు నెరవేరుతాయని అన్నారు. ప్రభుత్వంలో ఉండి వెల్ లో నినాదాలు చేస్తుంటే పట్టించుకునే ప్రభుత్వాలు లేవని, తాము ఆనాడు విభజన వద్దని ఎన్ని నినాదాలు చేశామో గుర్తులేదా? అని ఉండవల్లి ప్రశ్నించారు.
తాము ఏమీ సాధించలేకపోయామని, ఇప్పుడు టీడీపీ సభ్యులు కూడా అంతేనని అన్నారు. పాడిన పాతపాటే అరుణ్ జైట్లీ పాడినా, టీడీపీ గట్టిగా నిలదీయడంలో విఫలమవుతోందని పేర్కొన్నారు. ఆంధ్రాకు ఏదైనా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ కూడా సభలో డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.