India: దక్షిణాఫ్రికాపై రేపటి వన్డే గెలిస్తే.. రికార్డులోకెక్కనున్న టీమిండియా
- ఇప్పటికే 3-0 ఆధిక్యంలో ఉన్న భారత్
- దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు లేదా అంతకన్నా ఎక్కువ వన్డేల సిరీస్ గెలిచిన రెండో టీమ్‌గా నిలవనున్న భారత్
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానం పదిలం
- మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తోన్న ఆటగాళ్లు
వన్డేల్లో తలో 120 పాయింట్లతో వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆరు వన్డేల సిరీస్ లో వరుసగా మూడు వన్డేల్లోనూ దక్షిణాఫ్రికాపై భారత్ జయభేరి మోగించింది. రేపు నాలుగో వన్డే జరగనుంది. రేపు జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే ఈ సిరీస్ మన సొంతమవుతుంది. అంతేకాదు, టీమిండియా ఖాతాలో మరో రికార్డు కూడా చేరుతుంది.
దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు లేదా అంతకన్నా ఎక్కువ వన్డేల సిరీస్ గెలిచిన రెండో టీమ్‌గా భారత్ రికార్డు నెలకొల్పుతుంది. 2002లో దక్షిణాఫ్రికాను ఈ విధంగానే ఓడించి ఆస్ట్రేలియా మొదటిసారి ఈ రికార్డును సొంతం చేసుకుంది. రేపటి వన్డేలో భారత్ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్ లో మరికొంత రేటింగ్ తో భారత్ నంబర్ వన్ ర్యాంక్ పదిలమవుతుంది. భారత్‌తో జరిగిన టెస్టుల్లో రాణించి సిరీస్‌ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా వన్డేల్లో మాత్రం చతికిలపడుతోంది. భారత ఆటగాళ్లు రేపటి వన్డే కోసం మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపటి వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.