Hyderabad: బంజారాహిల్స్లో డ్రంకెన్ డ్రైవ్.. మద్యం మత్తులో పోలీసులపై యువకుడి దాడి!
- పోలీసుల అదుపులో 40 మంది
- 20 కార్లు, 25 బైక్లు స్వాధీనం
- కౌన్సెలింగ్ ఇవ్వనున్న పోలీసులు
హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లో ఓ యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. పోలీసులపై దాడికి దిగాడు. దీంతో స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 20 కార్లు, 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్లో ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తరచూ నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమంలో పలువురు పట్టుబడుతున్నారు. కొత్త సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకుని వస్తున్న యాంకర్ ప్రదీప్ కూడా ఇక్కడే పట్టుబడ్డాడు. అలాగే ఇటీవల విపరీతంగా పెరిగిన బైక్ రేసింగ్లపైనా దృష్టిసారించిన పోలీసులు వాటిపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల క్రితం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు రేసింగ్ నిర్వహించిన పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.