LK Advani: ఏపీ విషయంలో కేంద్రం ఎందుకిలా వ్యవహరిస్తోందో.. అసంతృప్తి వ్యక్తం చేసిన అద్వానీ!
- టీడీపీ ఎంపీలతో పది నిమిషాలపాటు భేటీ
- విభజన సమస్యలు, లోక్సభలో పరిణామాలను వివరించిన ఎంపీలు
- ఏపీకి న్యాయం చేయాల్సిందేనన్న సీనియర్ నేత
కేంద్రం తీరుపై బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో అన్యాయం జరిగిందంటూ నాలుగైదు రోజులుగా పార్లమెంటులో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలను శుక్రవారం అద్వానీ కలిసి మాట్లాడారు. పది నిమిషాల పాటు వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా విభజన హామీల గురించి ఎంపీలు ఆయనకు వివరించారు. తమ నిరసనకు గల కారణాలను, సభలో చోటుచేసుకున్న ఇతర పరిణామాలను అద్వానీ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం అద్వానీ మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగిందన్నది వాస్తవమేనని, విభజన ఇబ్బందులతో బాధపడుతున్న ఏపీకి న్యాయం చేయాల్సిందేనని అన్నట్టు తెలిసింది. అలాగే సభా మర్యాదలకు ఇబ్బంది కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యులపై ఉందన్నారు. ఏపీ వ్యవహారంపై మంత్రి అరుణ్ జైట్లీతో తాను మాట్లాడినట్టు అద్వానీ తెలిపారు. అయితే ఏపీ విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నారో మాత్రం తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.