Uttarakhand: రండి బాబూ... రండి.. షూటింగులు ఫ్రీగా చేసుకోండి!: దర్శక నిర్మాతలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆఫర్
- ఇకపై రాష్ట్రంలో సినిమా షూటింగులు ఉచితం
- దేశ, విదేశీ దర్శకనిర్మాతలను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నిర్ణయం
- ప్రకటించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్
సినీ దర్శకనిర్మాతలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎవరైనా ఉచితంగా సినిమా షూటింగులు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ పేర్కొన్నారు. సినిమా షూటింగ్‌లకు రాష్ట్రాన్ని కేంద్ర బిందువుగా మార్చడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా షూటింగ్ ఫీజును రద్దు చేసినట్టు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి సౌందర్యానికి కొదవ లేదని, సినిమా షూటింగ్‌లకు ఇది అద్భుతమైన ప్రదేశమని అన్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటిస్తున్న ‘బిజ్లీ గుల్ మీటర్ చాలూ’ సినిమా ముహూర్తపు షాట్‌కు సీఎం రావత్ క్లాప్ కొట్టారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సినిమా షూటింగ్‌లకు ఎటువంటి ఫీజు వసూలు చేయరాదని నిర్ణయించాం. దేశ, విదేశాల ఫిల్మ్ మేకర్లను ఆకర్షించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడి ప్రకృతి అందాలు షూటింగ్‌లకు అనువుగా ఉంటాయి’’ అని సీఎం పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌ను ‘దేవ్‌భూమి’ అని కూడా పిలుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన హిమాలయాల కారణంగా రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఇక, రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. దీనిని ప్రోత్సహించడం ద్వారా మరింతమందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా రావత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.