team india: సఫారీల భారమంతా డివిల్లియర్స్ పైనే... విజయంపై విశ్వాసంతో భారత్!
- వన్డే వరల్డ్ నెంబర్ వన్ హోదాలో బరిలో దిగుతున్న సౌతాఫ్రికా
- వన్డే వరల్డ్ నెంబర్ వన్ హోదా కోసం ఆడుతున్న భారత్
- ఏబీ డివిల్లియర్స్ పునరాగమనం
వన్డే వరల్డ్ నెంబర్ వన్ గా ఉంటూ, స్వదేశంలోనే వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలైన అపఖ్యాతిని మూటగట్టుకున్న సౌతాఫ్రికా విజయమే లక్ష్యంగా నేటి మ్యాచ్ లో బరిలో దిగనుంది. ఏబీ డివిల్లియర్స్ ఈ మ్యాచ్ తో జట్టులోకి రానుండడం ఆ జట్టులో కాస్త ధైర్యం నింపుతోంది. కోహ్లీకి సరిజోడీ బ్యాట్స్ మన్ లేక ఇబ్బంది పడుతున్న సఫారీలకు ఏబీ చేరిక బలాన్నిచ్చేదే. అయితే సఫారీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది మాత్రం చాహల్, కుల్దీప్... వీరు వేసే బంతులు సఫారీలకు అర్థం కావడం లేదు. స్పిన్ ను సమర్ధవంతంగా ఆడగలిగే ఆమ్లా వంటి వారిని పేసర్లు ముందుగానే పెవిలియన్ పంపుతున్నారు.
ఇక గెలవడం అన్న ప్రసక్తే లేదు కాబట్టి, సిరీస్ ను సమం చేయాలంటే సఫారీలు మూడు వన్డేల్లోనూ గెలవాలి. అయితే, ప్రస్తుతం టీమిండియా ఫాం చూస్తుంటే సఫారీలకు ఆ ఆశతీరేలా కనిపించడం లేదు. దీంతో ఆ జట్టు తీవ్ర ఒత్తిడినెదుర్కొంటోంది. పేసర్ల భారాన్ని ఏబీ, మిల్లర్ కి వదిలి, స్పిన్నర్ల భరతం ఆమ్లా, డుమిని, మార్క్ రమ్ పట్టాలని సగటు సౌతాఫ్రికా అభిమాని కోరుకుంటున్నాడు. ఈ మైదానంలో డివిల్లియర్స్ 11 మ్యాచ్ లు ఆడగా, అతని సగటు 100.85. దీంతో డివిల్లియర్స్ సఫారీ జట్టు రాత మారుస్తాడని అంతా ఆశిస్తున్నారు.
మరో వైపు మూడు వన్డేల విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా, ఈ వన్డేలో విజయం సాధించడం ద్వారా వన్డే వరల్డ్ నెంబర్ వన్ గా నిలవడంతో పాటు, సఫారీ గడ్డపై సిరీస్ గెలిచిన భారత జట్టుగా చరిత్ర నెలకొల్పాలని బలంగా కోరుకుంటోంది. దీనికి తోడు ఆటగాళ్లంతా కలిసి కట్టుగా రాణిస్తుండడం ఆ జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.