paddy: కొత్త రకం వరి వంగడాలు సృష్టించిన రైతు.. తల్లిదండ్రుల పేరు పెట్టిన వైనం!
- సరికొత్త వరి వంగడాలను సృష్టించిన కన్నడ రైతు
- ఈ వంగడాలకు తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా నామకరణం
- ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి
కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన ఔత్సాహిక రైతు సరికొత్త వంగడాలను సృష్టించారు. చీడపీడలను తట్టుకుంటాయని చెబుతున్న ఈ వంగడాలకు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు పెట్టి రుణం తీర్చుకున్నారు. దాని వివరాల్లోకి వెళ్తే.. మండ్య జిల్లా శివళ్లికి చెందిన రైతు బోరేగౌడ సేంద్రియ సాగును అనుసరించే రైతు. ఆయన రాజముడి రకం, సోనామసూరి వరి వంగడాలను సంకరం చేయడం ద్వారా సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు. ఈ సరికొత్త వంగడానికి, తండ్రి సిద్ధేగౌడ, తల్లి సణ్ణమ్మ పేర్లు కలిసి వచ్చేలా ‘సిద్ధ- సణ్ణ’ వరి రకం అని పేరు పెట్టారు.
ఈ వంగడం ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడిని ఇస్తుందని, విత్తనం చల్లిన రోజు నుంచి లెక్కవేస్తే 135 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని ఆయన తెలిపారు. ఈ వంగడం పలు రకాల తెగుళ్లను తట్టుకుని దిగుబడినిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ రకం వంగడాన్ని సాగు చేయటం ప్రారంభించిన తరువాత వచ్చిన దిగుబడి చూసి, తన చుట్టుపక్కల రైతులు కూడా సాగు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ వంగడాన్ని మార్కెటింగ్ చేసేందుకు 'సహజ సంవృద్ధ' అనే సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.