polavaram project: పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం.. నిర్మాణంలోకి అడుగుపెట్టిన నవయుగ!
- స్పిల్ వే కాంక్రీట్ పనులు ప్రారంభం
- రూ. 1244 కోట్ల పనులు నవయుగ సంస్థకు అప్పగింత
- 2015-16 ధరల ప్రకారమే పనులు చేపడుతున్న నవయుగ
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు ప్రారంభమయ్యాయి. ట్రాన్స్ ట్రాయ్, నవయుగ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు స్పిల్ వే కాంక్రీట్ పనులను నిన్న ప్రారంభించారు. ప్రాజెక్టు ఎస్ఈ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న క్రషర్ లు, బ్లాంచింగ్ ప్లాంట్ లు, మరిన్ని యంత్రాలు ఏప్రిల్ కల్లా పోలవరంకు వస్తాయని... అప్పటి వరకు ట్రాన్స్ ట్రాయ్ నుంచి తీసుకున్న యంత్రాలతో కాంక్రీట్ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు స్పిల్ వే పనులను త్రివేణి కంపెనీ చేపట్టిందని, ఇకపై వాటిని నవయుగ చేపడుతుందని తెలిపారు. త్వరలోనే కార్మికుల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ చేస్తామని చెప్పారు. కాగా, దాదాపు రూ. 1244 కోట్ల విలువైన పనులను నవయుగకు అప్పజెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2015-16 ధరల ప్రకారమే ఈ పనులను చేపట్టేందుకు నవయుగ ముందుకు వచ్చింది.