Andhra Pradesh: అప్పు తీసుకున్న వ్యక్తి ఆత్మహత్యా యత్నం... అప్పు ఇచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి!
- నాగేశ్వరరావుకు 8 లక్షలు అప్పుగా ఇచ్చిన సూర్యనారాయణ
- అప్పుతీర్చలేక నాగేశ్వరరావు ఆత్మహత్యాయత్నం
- ఆ వార్త విన్న సూర్యనారాయణ గుండెపోటుతో మృతి
అప్పు తీర్చలేనన్న భయంతో ఒకరు ఆత్మహత్యా యత్నం చేసుకోగా, ఆ అప్పు ఇక తిరిగి రాదన్న ఆవేదనతో అప్పు ఇచ్చిన వ్యక్తి గుండె ఆగి మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... నాదెండ్ల మండలం సంకురాత్రిపాడు గ్రామంలో నివాసముండే నాగేశ్వరరావుది వ్యవసాయాధారిత కుటుంబం.
వ్యసాయ అవసరాల నిమిత్తం నాగేశ్వరరావు తనకు తెలిసిన రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణ వద్ద 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవి తీర్చలేక నాగేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అయితే, ఆ విషయం సూర్యనారాయణకు తెలియడంతో ఇచ్చిన అప్పు ఇక తిరిగిరాదేమోనన్న ఆందోళన చెందాడు, దాంతో తీవ్రమైన ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.