bus stops: అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్లో 800లకు పైగా కొత్త బస్టాపులు
- కొత్త బస్టాపుల నిర్మాణాలపైన సమీక్షించిన కేటీఆర్
- సౌకర్యాల ప్రకారం కొత్త బస్టాండ్లను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి నిర్మాణాలు
- మార్చి మాసాంతానికి బస్టాపుల నిర్మాణం పూర్తి
- మెట్రో కారిడార్లలో బస్టాపుల ఏర్పాటు కోసం మెట్రో రైలు ఎండీతో సమన్వయం
హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కొత్త బస్టాపుల పైన కేటీఆర్ ఈ రోజు సమీక్ష జరిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన రెడ్డి, అడిషనల్ కమిషనర్ అద్వైత్ కూమార్, వర్కింగ్ ఎజెన్సీలు పాల్గొన్నాయి.
సుమారు 800కు పైగా కొత్త బస్టాపులు నగరంలో ఏర్పడనున్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. వాటిలో ఉన్న సౌకర్యాల ప్రకారం ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, అన్ని సౌకర్యాలున్న ఏ గ్రేడ్ బస్టాపుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. బస్టాపుల నిర్మాణంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అడిషనల్ కమిషనర్ అద్వైత్ కూమార్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి మాసాంతానికి బస్టాపుల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో బస్సు బేలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో వచ్చే వారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రో కారిడార్లలో బస్టాపుల ఏర్పాటు కోసం మెట్రో రైలు ఎండీతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులకు తెలియజేశారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, లేకుంటే కాంట్రాక్టు రద్దు చేసేందుకు వెనకాడబోమని మంత్రి వర్కింగ్ ఏజెన్సీలకు తెలిపారు.