Cricket: క్రికెట్ అప్ డేట్: తన వందో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్
- టీమిండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 200 (34.2 ఓవర్లకి)
- కోహ్లీ (75) ఔట్
- క్రీజులో శిఖర్ ధావన్ (107), అజింక్యా రహానె (5)
- వెలుతురు లేమి కారణంగా ప్రస్తుతం ఆటకు అంతరాయం
జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అదరగొట్టేస్తున్నాడు. శిఖర్ ధావన్ ఈ రోజు తన కెరీర్లో 100వ వన్డే ఆడుతూ, సెంచరీ చేయడం విశేషం. 99 బంతుల్లో సెంచరీ చేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ఆయనకు వన్డేల్లో ఇది 13వ సెంచరీ. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 5 పరుగులు చేసి ఔటయిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ ధాటిగా ఆడి 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.
మరోవైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 107, అజింక్యా రహానె 5 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 200 (34.2 ఓవర్లకి) గా ఉంది. కాగా, వెలుతురు లేమి కారణంగా 34.2 ఓవర్ వద్ద ఆటకు అంతరాయం కలిగింది.