India: భారత్ పై దక్షిణాఫ్రికా అనూహ్య విజయం!
- పలుమార్లు మ్యాచ్ ని అడ్డుకున్న వరుణుడు
- తొలుత బ్యాటింగ్ చేసి 289 పరుగులు చేసిన టీమిండియా
- డక్వర్త్ లూయిస్ విధానంలో 28 ఓవర్లకు 202 పరుగుల లక్ష్యం
- 25.3 ఓవర్లలోనే ఛేదించిన దక్షిణాఫ్రికా
వరుణుడు పలు మార్లు అడ్డుకున్న 'పింక్' పోరులో భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి, నాలుగో మ్యాచ్ విజయంతో సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న భారత్ ఆశలను సౌతాఫ్రికా ఆటగాళ్లు మిల్లర్, క్లాసెన్ లు నీరుగార్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా ముందు 290 పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పటికీ, వర్షం కారణంగా ఆట ఆగి, ఆగి సాగగా, డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 28 ఓవర్లకు 202 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచారు. కేవలం 25.3 ఓవర్లలోనే సౌతాఫ్రికా 207 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సిరీస్ లో నాలుగో మ్యాచ్ మంగళవారం నాడు పోర్ట్ ఎలిజబెత్ లో జరగనుంది.
290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మార్క్ రమ్ (22), ఆట్లా (33), డుమిని (10), ఏబీ డివిలియర్స్ (28) తక్కువ స్కోరు చేసి ఔటైనా, మిల్లర్, కాసెన్ లు రెచ్చిపోయారు. మిల్లర్ 28 బంతుల్లో 39, క్లాసెన్ 27 బంతుల్లో 43 పరుగులు చేయడం, ఫెలుక్ వాయో కేవలం 5 బంతుల్లోనే 1 ఫోర్, మూడు సిక్స్ లు కొట్టి 23 పరుగులు చేయడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా వశమైంది. ఫీల్డింగ్ లో భారత్ లోపాలు, కీలక సమయాల్లో క్యాచ్ లను జారవిడవడం భారత ఓటమికి కారణాలయ్యాయి.