scum: దేశంలోని అలగా జనమంతా గోవాలో వాలిపోతున్నారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- అవును.. వారు అలగా జనమే.. సమర్థించుకున్న మంత్రి
- వారికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు
- గోవాను హరియాణాగా మార్చాలనుకుంటున్నారు
- మంతి వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం
గోవా పట్టణ, ప్రణాళిక మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాస్తంత సేద తీరేందుకు గోవా వెళ్లే పర్యాటకులను అలగా జనంగా అభివర్ణించారు. ఉత్తరాది పర్యాటకులు గోవాను మరో హరియాణాగా మార్చాలనుకుంటున్నారని అన్నారు. వాళ్లిక్కడ మురికి వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. గోవా గురించి వారికి ఏమాత్రం చింత లేదని, దీనిని మరో హరియాణాగా మార్చాలని అనుకుంటున్నారని ఆరోపించారు.
‘గోవా బిజ్ ఫెస్ట్’లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవా వస్తున్న దేశీయ పర్యాటకుల్లో అత్యధిక శాతం మంది అలగా జనమేనని నొక్కి వక్కాణించారు. రాష్ట్ర జనభా కంటే ఆరు రెట్లు ఎక్కువగా పర్యాటకులు వస్తున్నారని, వీరు ఉన్నత స్థాయికి చెందిన వారు కాదని అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలకంటే గోవా భిన్నమైనదని, అత్యున్నతమైదని పేర్కొన్న సర్దేశాయ్ బాధ్యతారహితులైన పర్యాటకులను నియంత్రించడం కష్టమైన పని అని అన్నారు.
మంత్రి సర్దేశాయ్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పర్యాటకులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ తనకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదని, తాను ఉత్తరాది వారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
గోవాకు వస్తున్నవారు అలగా జనమేనన్న తన వ్యాఖ్యలను మాత్రం ఆయన సమర్థించుకున్నారు. తమకు కావాల్సింది అలగా జనం కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించే ధనిక పర్యాటకులని పేర్కొన్నారు. గోవాకు వస్తున్న 6.5 మిలియన్ల మంది పర్యాటకులతో గోవాలో న్యూసెన్స్ ఏర్పడుతోందని అన్నారు. వీరికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండదని, చెత్తాచెదారాన్ని వదిలేసి న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపించారు.