China: ద్వంద్వ నీతి! భారత్‌ను వదిలేసి చైనా వైపు మాల్దీవుల మొగ్గు!
- భారత్‌పై తమ విధానాన్ని మార్చేసుకున్న మాల్దీవులు
- రాజకీయ సంక్షోభ నివారణకు ప్రతిపక్ష నేతలు భారత సాయాన్ని అర్థించడమే కారణం
- చైనాతో సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు యమీన్ యత్నం
వారం రోజుల్లోనే మాల్దీవుల విధానం మారిపోయింది. నిన్నమొన్నటి వరకు ‘ఇండియా ఫస్ట్’.. ‘చైనా నెక్ట్స్’ అన్న మాల్దీవులు ఇప్పుడు ‘చైనా ఫస్ట్’, ‘భారత్ నెక్ట్స్’ అనే పాటపాడుతోంది. ‘ఇండియా ఫస్ట్’ అనేదే తమ విధానమని కొన్ని వారాల క్రితం భారత్‌లో పర్యటించిన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రత్యేక దూత, విదేశాంగ మంత్రి మొహమ్మద్ అన్నారు. అయితే ప్రస్తుత దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, సుప్రీంకోర్టు, ప్రతిపక్ష నేతలు భారత సాయాన్ని అర్ధించడంతో మాల్దీవుల విధానం ఒక్కసారిగా మారిపోయింది.
నిజానికి చైనాతో మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు యమీన్‌కు అంత సఖ్యత లేదు. గత అద్యక్షుడు మహమ్మద్ నషీద్ 2011లో మాలేలో చైనా రాయబార కార్యాలయ ఏర్పాటుకు అనుమతించారు. అలాగే చైనా ఆర్థిక విధానాలను అనుమతించారు. ఆ తర్వాత యమీన్ అధ్యక్షుడయ్యాక దానిని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చైనాతో స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా మాల్దీవులపై భారత్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేశారు. అర్ధరాత్రి వేళ కేవలం 15 నిమిషాల్లోనే ఈ డీల్‌ను అంగీకరించారు.
నిజానికి భారత్ 1981లోనే మాల్దీవులతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ అవసరమైన వస్తువులను మాల్దీవులకు ఎగుమతి చేయగా, మాల్దీవులు ఉత్పత్తి చేసే ఏ వస్తువునైనా భారత్‌లో విక్రయించుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఆ దేశంతో ఉన్న కాస్తోకూస్తో సంబంధాలు కూడా ఇప్పుడు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల నెలకొన్న రాజకీయ సంక్షోభమే.
ప్రతిపక్ష నేతలు, సుప్రీం కోర్టు బాహాటంగానే భారత్ సాయాన్ని అర్ధించడం అధ్యక్షుడు యమీన్‌కు నచ్చలేదు. దీంతో ఆయన చైనా వైపు మరోమారు దృష్టిసారించారు. చైనాతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారత్‌తో ఆ దేశం కుదుర్చుకున్న రాడార్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్టు నత్తనడక సాగుతోంది.
మరోవైపు మాలే-హల్హులే ఫ్రెండ్షిప్ బ్రిడ్జిలో చైనా పెట్టుబడులు గుమ్మరించడం. అంతేకాదు హల్హుమాలె, చైనా మిలటరీ బేస్ అయిన లము అటోల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోనూ చైనా ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెడుతోంది. చైనాలో మాల్దీవుల ప్రత్యేక దూత మహమ్మద్ సయీద్ గురువారం మాట్లాడుతూ మాల్దీవుల్లో చైనా పెట్టుబడులను రక్షించుకునేందుకు ‘భద్రత’ కల్పించాలని కోరారు. ఇవన్నీ చూస్తుంటే మాల్దీవులు క్రమంగా చైనా వైపు జరుగుతున్నట్టు అనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.