Harika Hasini Creations: ఫ్రాన్స్, అమెరికాల్లో మరో సినిమాను విడుదల చేయాలంటే రెండు సార్లు ఆలోచించుకునేలా బుద్ధి చెబుతా: 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు జెరోమ్ సాలీ వార్నింగ్!

  • 'అజ్ఞాతవాసి' నిర్మాతలను కోర్టుకు లాగుతా
  • ఫ్రాన్స్ లేదా అమెరికాల్లో కేసు వేయనున్నా
  • ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించాను
  • 'లార్గో వించ్' దర్శక నిర్మాత జెరోమ్ సాలీ

తాను ఫ్రెంచ్ భాషలో తీసిన 'లార్గో వించ్' చిత్రాన్ని అనుమతి లేకుండా కాపీ కొట్టి 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని తీశారని ఆరోపిస్తున్న జెరోమ్ సాలీ, తాజాగా హారికా హాసినీ క్రియేషన్స్ కు మరో హెచ్చరిక చేశారు. 2008లో తాను తీసిన చిత్రాన్ని కాపీ కొట్టడంతో పాటు, దాన్ని అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లోనూ విడుదల చేశారని, ఇకపై ఆ సంస్థ తన చిత్రాలను ఇక్కడ విడుదల చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా గుణపాఠం చెబుతానని అన్నారు. తాను ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు పంపించానని, ఇది తొలి అడుగు మాత్రమేనని, నిర్మాతల నుంచి సరైన సమాధానం రాకుంటే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.

యూఎస్ లేదా ఫ్రాన్స్ లోని కోర్టుకు నిర్మాతలను లాగుతానని అన్నారు. సినిమాను తాను చూసిన తరువాత కోపగించుకోలేదని, కానీ, చిత్రం విడుదలై నెల రోజులు గడిచినా నిర్మాతల నుంచి స్పందన రాకపోవడంతో ఆగ్రహం కలిగి నోటీసులు పంపానని తెలిపారు. చిత్రంలోని ఎన్నో సీన్లు, లొకేషన్లు, డైలాగులు తన చిత్రం నుంచి కాపీ కొట్టారని ఆరోపించిన ఆయన, హారికా హాసినీ యాజమాన్యమే తన వద్దకు వచ్చేలా చేస్తానని అన్నారు.

టీ-సిరీస్, 'అజ్ఞాతవాసి' టీమ్ మధ్య ఓ సెటిల్ మెంట్ జరిగినట్టు తనకు తెలిసిందని, తాను పలుమార్లు టీ-సిరీస్ ను సంప్రదించినా, సెటిల్ మెంట్ పై వారింకా స్పందించలేదని అన్నారు. తాను భారత హక్కులను మాత్రమే టీ-సిరీస్ కు విక్రయించానని, సినిమా విదేశాల్లోనూ విడుదలైనందున తానిచ్చిన హక్కులను మీరినట్టేనని అన్నారు. టీ-సిరీస్, హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మాతల మధ్య జరిగిన సెటిల్ మెంట్ కోర్టుల్లో చెల్లబోదని అన్నారు.

  • Loading...

More Telugu News