Narendra Modi: ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రఘువీరా బహిరంగ లేఖ
- పార్లమెంట్ లో మోదీ ఇటీవల చేసిన ఉపన్యాసంపై రఘువీరా అభ్యంతరం
- మహనీయుల త్యాగాలను అవమానపరిచేలా మోదీ ఉపన్యసించారు
- విభజన జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు
- బహిరంగ లేఖలో రఘువీరా
భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ఉపన్యాసంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘భారతదేశ తొలి ప్రధానిగా, నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ. అలాంటి మహానాయకుడి త్యాగాలను అవమానించే విధంగా మీరు చేసిన వ్యాఖ్యలు యావత్ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని, ఆ స్వతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన అనేకమంది మహనీయుల త్యాగాలను మీరు అవమానం చేసినట్టుగానే దేశం భావిస్తుంది. భారత ప్రజాస్వామ్యం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు డా.బి.ఆర్ అంబేద్కర్ గారి మహోన్నత కృషిని, ఆయనతో పాటు రాజ్యాంగ రూపకల్పనకు సుమారు 3 సంవత్సరాల పాటు కృషి చేసిన మహామేధావుల్ని మీరు తక్కువ చేసి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా వుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి కూడా మీరు పదేపదే ప్రస్తావిస్తున్నారు.
పటేల్ గారు జవహర్ లాల్ నెహ్రూ సహచర్యంలో పని చేసి దేశానికి సేవలు చేసిన గొప్పనాయకుడు. నెహ్రూ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమను కనబరుస్తూ నెహ్రూగారికే లేఖ రాసిన సర్దార్ పటేల్ గురించి మీరు మాట్లాడటం మీ కుటిల రాజకీయ ఎత్తుగడ తప్ప మరేమీకాదు. భారతదేశం గత 70 సంవత్సరాల్లో అనేక మంది ప్రధానులను చూసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధానులనే కాకుండా, కాంగ్రెసేతర ప్రధానులనూ చూసింది. ముఖ్యంగా మీ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయి గారు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ఆయన నడవడిక, మాట తీరు ప్రధాన పదవి హోదాను ఏనాడూ తగ్గించలేదు. గత 70 ఏళ్ల ఆధునిక భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ప్రధానీ ఇలాంటి ఉపన్యాసాన్ని పార్లమెంటులో చేయలేదని చెప్పడానికి విచారిస్తున్నాం’ అని విమర్శించారు.
ఏపీ విభజన గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు అమలు కావడం లేదు. 5వ బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు యూపీఏ కూటమిలోని 14 రాజకీయపార్టీలు మద్దతు తెలిపి ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలన్నీ అమలు చేయమని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
‘ఆఖరిగా చెబుతున్నా ‘ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ తనకుతాను నష్టపోయింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేయలేదు..కనుకనే.. ప్రత్యేకహోదా, పోలవరానికి జాతీయహోదా లాంటి అనేక అంశాలను ఏపీకి ఇస్తూ చట్టం చేసింది. హామీలను ఇచ్చింది. భారత పార్లమెంట్ గడపను ముద్దాడి, గౌరవాన్ని చాటుకున్న మీరు దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా మా చట్టాన్ని (ఆంధ్రప్రదేశ్), హామీలను , కేబినెట్ నిర్ణయాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభ్యర్థిస్తున్నాను. పార్లమెంట్ గౌరవాన్ని ఇనుమడింప చేయాలని కోరుతున్నాను’ అని ఆ బహిరంగ లేఖలో రఘువీరా కోరారు.