Tamil Nadu: రజనీ రంగు 'కాషాయం' కాకుంటే చూద్దాం!: కమల్
- రాజకీయ పొత్తుపై విశ్వనటుడు కమలహాసన్
- భావసారుప్యత ఉంటే చేతులు కలిపేందుకు రెడీ
- మెజార్టీ రాకుంటే వచ్చే ఎన్నికల దాకా వెయిట్ చేస్తాం
అభిమానుల బలం మెండుగా ఉన్న ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తుండటంతో వారిద్దరూ కలిసి పనిచేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని వారిద్దరి వద్ద ప్రస్తావించినప్పుడల్లా 'కాలమే నిర్ణయిస్తుందంటూ' వారు సమాధానాన్ని దాటవేస్తున్నారు. కానీ, హార్వర్డ్ యూనివర్శిటీలో శనివారం ఓ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ...రజనీ కాంత్ రంగు కాషాయం కాకుంటే ఆయనతో పొత్తు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇందుకు కారణం, రజనీ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి కావడంతో పాటు ఆయన బీజేపీతో చేతులు కలపవచ్చనే ఊహాగానాలు చాలాకాలంగా జోరుగా విన్పిస్తుండటమే!
మతతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించే వ్యక్తిగా కమల్ తన మిత్రుడి రంగు కాషాయమైతే (అంటే బీజేపీ) ఆయనతో కలిసి పనిచేసే అవకాశమే లేదని ఒకరకంగా తేల్చి చెప్పేశారు. తమ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాల మధ్య అదే విధంగా రెండు పార్టీల మేనిఫెస్టోల్లోనూ సారూప్యత గనుక ఉంటే పొత్తు కుదరవచ్చని విశ్వనటుడు చెప్పారు. పొత్తు విషయంలో ప్రస్తుతానికైతే తనకు స్పష్టమైన అవగాహన లేదని ఆయన అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో తన పార్టీకి తగిన మెజార్టీ రాకపోతే అది ప్రజల తీర్పుగా భావిస్తానని, వచ్చే ఎన్నికల దాకా ఓర్పుగా వేచి ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా, విపక్షంలో కూర్చోవడానికైనా తాను సిద్ధమేనన్న సంకేతాలను ఈ యూనివర్శల్ హీరో పంపారు.