Hyderabad: హైదరాబాద్‌లోని హీరో హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. 60 బైక్‌లు దగ్ధం
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం?
- కోటి రూపాయల ఆస్తి నష్టం
- కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 60 బైక్‌లు, ఫర్నిచర్, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. కోటి రూపాయలకు పైగా ఆస్తినష్టం సంభవించినట్టు అంచనా. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం షోరూంను తెరిచేందుకు షట్టర్‌ను పైకి లేపేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా లోపలి నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే ఆయన పోలీసులకు, షోరూం యాజమాన్యానికి సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు షోరూం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో 60 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అలాగే కీలక ఫైళ్లు, ఫర్నిచర్, ఏసీలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.