REddy Shankaravam: 'రెడ్డి శంఖారావం'లో తెలంగాణ హోం మంత్రి నాయినిపై యువత ఆగ్రహానికి కారణమిదే!
- నాయినికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన యువత
- రెడ్లకు రిజర్వేషన్లు లభించే పరిస్థితి లేదన్న నాయిని
- రాజ్యాంగ సవరణ అంత సులభం కాదని వ్యాఖ్య
నిన్న వరంగల్ లో జరిగిన 'రెడ్డి శంఖారావం'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రసంగిస్తున్న వేళ, కొందరు యువత ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తూ, వాటర్ బాటిళ్లను స్టేజ్ పైకి విసిరిన సంగతి తెలిసిందే. నాయిని తన ప్రసంగంలో రెడ్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించే పరిస్థితి లేదన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడమే యువకుల్లో ఆగ్రహానికి కారణమైంది.
దేశంలో మరే కులానికైనా రిజర్వేషన్లు దగ్గర చేయాలంటే రాజ్యాంగాన్ని మార్చడం ఒక్కటే మార్గమని, అది అంత సులభంగా జరిగే పనికాదని నాయిని చెప్పడంతో, సభకు వచ్చిన యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వాటర్ బాటిళ్లు స్టేజ్ పై పడుతుంటే, నాయినికి రక్షగా పోలీసులు వలయంలా నిలిచారు. అనంతరం సభ నిర్వాహకులు పదేపదే సర్దిచెప్పడంతో, యువతలో ఆగ్రహం సద్దుమణిగి నాయిని తన ప్రసంగాన్ని కొనసాగించారు.