Narendra Modi: గూగుల్ లో 'కుట్ర' అని టైప్ చేస్తే ఎవరి పేరు వస్తుందో తెలుసా?: కాంగ్రెస్ నేత దాసోజు
- కుట్ర అని టైప్ చేస్తే కేటీఆర్ ఫొటోలు వస్తాయి
- మోదీతో టీఆర్ఎస్ కు లోపాయికారీ ఒప్పందం ఉంది
- బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగినా కామ్ గా ఉన్నారు
గూగుల్ లో తెలుగు భాషలో 'కుట్ర' అని టైప్ చేస్తే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫొటోలు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. కుట్రకు పర్యాయపదంగా కేటీఆర్ నిలిచారని విమర్శించారు. ప్రధాని మోదీతో టీఆర్ఎస్ పార్టీ లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుందని ఆరోపించారు. అందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీపై మోదీ విమర్శలు గుప్పించగానే... ఇక్కడ చిట్ చాట్ పేరుతో కాంగ్రెస్ పై కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలారని విమర్శించారు.
మరుసటి రోజు వార్తాపత్రికల్లో వచ్చిన ఆ క్లిప్పింగ్ లను మోదీకి చేరవేసేందుకు... వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, రాజకీయ కుట్రకు పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లోఫరా? లేక రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న మీరు లోఫర్లా? అని ప్రశ్నించారు. ఈడీ, సహారా సీబీఐ కేసులకు భయపడే మోదీతో టీఆర్ఎస్ లాలూచీ పడుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ ఎంపీలు నోర్మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు.