Air India: శభాష్... కెప్టెన్ అనుపమ..శభాష్!: పెను ప్రమాదాన్ని తప్పించిన ఎయిరిండియా పైలట్‌పై ప్రశంసల జల్లు
- పెను ప్రమాదాన్ని తప్పించినందుకు మహిళా పైలట్‌కు ప్రశంసలు
- తమ సిబ్బంది తప్పులేదంటోన్న విస్తారా యాజమాన్యం
- అయోమయానికి కారణమైన ట్రాఫిక్ కంట్రోలర్ల సస్పెన్షన్
ముంబై గగనతలంలో గత బుధవారం (ఫిబ్రవరి 7) ఓ పెను ప్రమాదం తప్పడంలో కీలక పాత్ర పోషించిన ఎయిరిండియా మహిళా పైలట్ కెప్టెన్ అనుపమ కోహ్లీని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా విమానం 'ఏ-319'కి, ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తారా విమానం 'ఏ-320' నియో మధ్య ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో రెండు విమానాల్లో 261 మంది ప్రయాణికులు ఉన్నారు. సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించి ప్రయాణికుల ప్రాణాలను నిలిపినందుకు ఆమెకు అన్ని వైపుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఏటీసీ, విస్తారా కాక్‌పిట్ మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో అయోమయం నెలకొంది. ఆ సమయంలో రెండు కాక్ పిట్లలో ఇద్దరు మహిళలు సంభాషిస్తున్నారు. విస్తారా విమాన కెప్టెన్ టాయిలెట్‌కు వెళ్లినపుడు అందులోని మహిళా కో పైలట్ కాక్‌పిట్‌లో సంభాషిస్తూ విమానాన్ని నడిపారు. ఆ సమయంలో ఎయిరిండియా విమానంలో కెప్టెన్ అనుపమ కోహ్లీ కమాండర్‌గా ఉన్నారు.
కాక్‌పిట్లకు అందిన సమాచారం అయోమయానికి గురి చేయడంతో 20 ఏళ్లకు పైగా అనుభవమున్న ఎయిరిండియా కెప్టెన్ అనుపమ కోహ్లీ తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. విస్తారా విమానం తన విమానం దిశగా వస్తున్నట్లు ఆమె గమనించారు. విస్తారా విమానం యూకే 997కి ఏటీసీ ఇచ్చిన సమాచారాన్ని కాక్‌పిట్‌లో ఆమె విన్నారు. దాంతో ఏటీసీకి, విస్తారాలోని మహిళా పైలట్‌కి మధ్య సమాచార లోపం చోటు చేసుకుందని కెప్టెన్ అనుపమ గ్రహించారు.
అదే సమయంలో ఓ రిజల్యూషన్ అడ్వైజరీ (ఆర్ఏ) 'ఎత్తు పెంచు... ఎత్తు పెంచు' అంటూ ఇచ్చిన సమాచారాన్ని అందుకున్న అనుపమ వెంటనే ఎత్తు పెంచారు. దాంతో 261 మంది ప్రయాణిస్తున్న రెండు విమానాలు పరస్పరం ఢీకొనకుండా పెను ప్రమాదం తప్పినట్లయిందని ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఏటీసీ సూచనల మేరకు తమ సిబ్బంది నడుచుకున్నారని, నిబంధనలను ఉల్లంఘించలేదని విస్తారా యాజమాన్యం సమర్థించుకుంటోంది. ఈ అయోమయానికి కారణంగా భావిస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఏదేమైనా...అనుపమ సమయస్ఫూర్తికి మాత్రం ఇటు ఎయిరిండియాతో పాటు ప్రయాణికులు కూడా ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.