Prime Minister Narendra Modi: మస్కట్లో పురాతన శివాలయం సందర్శనకు ప్రధాని మోదీ!
- దాదాపు 125 ఏళ్ల నాటి శివాలయానికి మోదీ
- తర్వాత సుల్తాన్ ఖబూస్ మసీదు సందర్శన
- రేపు న్యూఢిల్లీకి తిరుగుప్రయాణం
ప్రధాని మోదీ తన దక్షిణాసియా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం మస్కట్లోని దాదాపు 125 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని దర్శించుకోనున్నారు. ప్రయాణ షెడ్యూల్లో భాగంగా ఆయన ఈ రోజు సాయంత్రం గ్రాండ్ సుల్తాన్ ఖబూస్ మసీదుకు వెళ్తారు. ఈ మసీదును దాదాపు మూడు లక్షల భారతదేశ ఇసుకరాళ్లతో నిర్మించారు. మసీదు సందర్శన తర్వాత ఆయన ఒమన్లోని పలు ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ అవుతారు. కాగా, ఆదివారం నాడు ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్తో సమావేశమైన మోదీ పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, రక్షణ, ఆహార భద్రత, ప్రాంతీయ సమస్యల పరంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య పౌర, వాణిజ్య అంశాల్లో చట్టపరమైన, న్యాయ సహకారంపై ఓ అవగాహన ఒప్పందం సహా ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరాయి. కాగా, ప్రధాని మోదీ ఈ రోజుతో తన దక్షిణాసియా దేశాల పర్యటనను ముగించుకుని రేపు న్యూఢిల్లీ చేరుకుంటారు.