IPC: తాజ్మహల్ చుట్టూ డ్రోన్లు ఉపయోగిస్తే జైలుకే...!
- ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
- గతేడాది తాజ్ మహల్ చుట్టూ 20 సార్లు డ్రోన్ల గుర్తింపు
- భద్రతా కారణాల వల్లే కొత్త నిబంధనలంటోన్న పోలీసులు
ప్రపంచ వారసత్వ సంపదగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న 'తాజ్ మహల్' దరిదాపుల్లో డ్రోన్లను ఉపయోగించిన వారిని జైలుకు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు. తాజ్ మహల్ చుట్టుపక్కల డ్రోన్లను ఉపయోగిస్తే వారిపై నేరపూరిత అభియోగాలను నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. డ్రోన్లను వాడొద్దంటూ ఇప్పటివరకు చేస్తున్న హెచ్చరికలను పర్యాటకులు పట్టించుకోనందు వల్లే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని వారు చెబుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాదిలో సుమారు 20 సార్లు తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను గుర్తించారు. అయితే వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
ఆగ్రా నగర ఎస్పీ కున్వార్ అనుపమ్ సింగ్ మాట్లాడుతూ...తాజ్ మహల్ చుట్టూ డ్రోన్లను ఉపయోగించే వారిపై ఐపీసీలోని సెక్షన్ 287 (యంత్రసామగ్రి పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం), సెక్షన్ 336 (ఇతరుల జీవితం లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కల్గించడం), సెక్షన్ 337 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కల్గించడం ద్వారా ఇబ్బంది పెట్టడం), సెక్షన్ 338(ఇతరుల జీవితం లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కల్గించడం ద్వారా అపాయకరమైన దెబ్బ తీయడం) కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు.
భద్రతా కారణాల వల్లే తాజ్ మహల్ చుట్టూ డ్రోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని ఆయన తెలిపారు. "కొత్త నిబంధనల గురించి అతిథులకు వివరించాలంటూ హోటళ్ల యజమానులు, వారి సంఘాలకు తెలియజేస్తున్నాం" అని ఆయన చెప్పారు. మరోవైపు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే తాజ్ మహల్ చుట్టూ ఎవరూ డ్రోన్లను వినియోగించకుండా అడ్డుకట్ట వేయగలమని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ (ఆగ్రా) బ్రిజ్ భూషణ్ అభిప్రాయపడ్డారు.