Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం : రేప్‌ను ప్రతిఘటించినందుకు మైనర్ సజీవదహనం
- మైనర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన మృగాడు
- బాలిక మంటల్లో చిక్కుకోగానే కిరాతకుడి పరార్
- నిందితుడి కోసం త్రిసభ్య బృందం గాలింపు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అత్యాచారాన్ని ప్రతిఘటించినందుకు ఓ మైనర్ బాలికను మృగాడు సజీవదహనం చేయడానికి తెగించాడు. రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు అందించిన వివరాల్లోకెళితే...దళిత వర్గానికి చెందిన 13 ఏళ్ల బాధితురాలిపై నిందితుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
ఇంటిలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన అతను ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె అరుపులతో ఏడుస్తూ అతని దుశ్చర్యను ప్రతిఘటించింది. సహనం కోల్పోయిన నిందితుడు ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. ఆమె కేకలు వేయకుండా చేయడానికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడ నుండి పారిపోయాడు.
శనివారం రాత్రి బాధితురాలిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె శరీరం 50 శాతం కాలిపోయిందని వైద్యులు చెప్పారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను భోపాల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజ్‌గఢ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్డీఓపీ శంభు సింగ్ అహీర్వాల్ తెలిపారు.