Vijay mallya: విజయ్ మాల్యాకు భారీ షాక్.. రూ.585 కోట్లు చెల్లించాలంటూ లండన్ హైకోర్టు ఆదేశం
- బీఓసీకి బకాయి సొమ్ము చెల్లించని కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్
- మాల్యాకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు
- వడ్డీతో సహా చెల్లించాలన్న కోర్టు
భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు భారీ షాకిచ్చింది. విమానాలను అద్దెకిచ్చే సింగపూర్ సంస్థ బీఓసీ ఏవియేషన్ కేసులో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు తీర్పు చెప్పింది. నష్టపరిహారం కింద బీఓసీకి రూ.585 కోట్లు (9 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
బీఓసీ ఏవిషయన్-కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీఓసీ ఏవియేషన్ నాలుగు విమానాలను కింగ్‌ఫిషర్‌కు లీజుకు ఇవ్వాల్సి ఉంది. అయితే మూడు విమానాలను మాత్రమే ఇచ్చిన బీఓసీ అడ్వాన్స్ సొమ్మును పూర్తిగా చెల్లించని కారణంగా నాలుగో విమానాన్ని ఇవ్వలేదు. సంవత్సరాలు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో బీఓసీ సంస్థ లండన్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు కింగ్‌ఫిషర్‌ను దోషిగా తేల్చింది. బకాయి సొమ్మును వడ్డీతో సహా చెల్లించడంతోపాటు న్యాయపోరాటానికి అయిన ఖర్చులను కూడా చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ పికెన్ ఆదేశించారు.
భారత్‌లోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగవేసిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నారు. మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను భారత్ పంపించాల్సిందిగా కోరుతూ భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. 6.5 లక్షల పౌండ్ల పూచీకత్తు చెల్లించిన మాల్యా ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. వచ్చే నెల 16న తుది విచారణ జరగనుంది.