Indian Railway: ‘ఇంటర్ సిటీ’ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం!
- 10 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే ట్రాక్
- 250 కిలోమీటర్ల వేగంతో రైళ్ల పరుగులు
- ఏప్రిల్లో ప్రకటించనున్న రైల్వే మంత్రి
‘ఇంటర్ సిటీ’ రైల్వే ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రయాణికులు మరింత వేగంగా తమ గమ్యస్థానాలను చేరుకోనున్నారు. ఇందుకోసం రైళ్ల వేగాన్ని 200-250 కిలోమీటర్లకు పెంచాలని రైల్వే యోచిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్లో కొత్త హైస్పీడ్ కారిడార్లను ప్రకటించనుంది. హైస్పీడ్ కారిడార్లను గుర్తించడంతో పాటు నిర్మాణ వ్యయాన్ని సగానికి తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు.
విశ్వనీయ వర్గాల ప్రకారం.. మొత్తం 10 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే కారిడార్లను కొత్తగా ప్రకటించనున్నారు. ఈ మార్గాల్లో ఇంటర్ సిటీ రైళ్లను గంటకు 200-250 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. ఫలితంగా ప్రయాణికులు అతి తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకునే వీలుంది. దీనివల్ల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు చాలినంత సమయం ఉంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కిలోమీటరు హైస్పీడు ట్రాక్ నిర్మాణానికి ఇంచుమించు రూ.100 కోట్లు అవుతుండగా దానిని సగానికి తగ్గించాలని రైల్వే యోచిస్తోంది. ప్రస్తుతం ముంబై-పుణె మధ్య నడుస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు మూడు గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అది గంటన్నరకు తగ్గిపోనుంది.