Students: ప్రియుడు, ప్రియురాలంటూ తిరగొద్దు... శివరాత్రి జరుపుకోండి: విద్యార్థులకు లక్నో యూనివర్శిటీ సలహా
- వాలెంటైన్స్ డే రోజున సెలవిచ్చిన వర్శిటీ
- పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు సలహా
- ఇంట్లోనే మహాశివరాత్రి జరుపుకోవాలని సూచన
రేపు వాలెంటైన్స్ డే అంటూ క్యాంపస్ లో అమ్మాయిలు, అబ్బాయిలు కలసి తిరగరాదని, అలా ఎవరైనా కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో యూనివర్శిటీ హెచ్చరించింది. ప్రియుడు, ప్రియురాలు అంటూ తిరిగే బదులు మహా శివరాత్రి పర్వదినం జరుపుకోవాలని సూచించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొంది.
ఈ మేరకు వర్శిటీలో ఓ నోటీసును ఇస్తూ, "గత కొన్నేళ్లుగా వెస్ట్రన్ కల్చర్ పెరిగి ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 14న మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నాం. ఏ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్లాసులు జరగవు. తల్లిదండ్రులు ఎవరూ తమ పిల్లలను వర్శిటీకి పంపించవద్దు" అని సూచించింది. వర్శిటీ ఈ తరహా నోటీసును ఇవ్వడం ఇదే తొలిసారి. 2009 నుంచి ఫిబ్రవరి 14న వర్శిటీలోకి పూలు, బొకేలు తేవడాన్ని నిషేధించారు.