somu veerraju: ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి: సోము వీర్రాజు డిమాండ్
- ఏపీ ప్రభుత్వం వద్ద వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక ఉందా?
- మేము విభజన హామీలన్నీ నెరవేర్చుతున్నాం
- ఏపీకి ఇప్పటివరకు అదనంగా ఎనిమిది యూనివర్సిటీలు వచ్చాయి
- ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టాలని, ఈ నాలుగు పునర్విభజన బిల్లులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే కేంద్ర సర్కారు వీటి కోసం సాయం చేసిందని, మొత్తం రూ.1500 కోట్లు ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు.
తాము విభజన హామీలన్నీ నెరవేర్చుతున్నామని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటివరకు అదనంగా ఎనిమిది యూనివర్సిటీలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని తెలిపారు.
అలాగే, దక్షిణ భారతం పట్ల వివక్ష అని మాట్లాడడం ఏంటని, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు మనకంటే దారుణంగా ఉన్నాయని, ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఎక్కడ, ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని నిలదీశారు. కాగా, విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ లేదని కమిటీలు చెబుతున్నాయని తెలిపారు.