Jagan: నాలుగేళ్ల క్రితం ఈ పెద్దమనిషి ఏమన్నారు?: చంద్రబాబుపై జగన్ విమర్శలు
- రుణమాఫీ, జాబు అంటూ ఎన్నో మాటలు చెప్పారు
- నెరవేర్చారా?
- మళ్లీ ఎన్నికల ముందు వచ్చి ఎన్నో హామీలు ఇస్తారు నమ్మకండి
- డబ్బు ఇస్తారు తీసుకోండి.. కానీ టీడీపీకి ఓట్లు వేయకండి
'నాలుగేళ్ల క్రితం ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారు?' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఈ రోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలో ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు బెల్టు షాపులను అరికడతానన్నారు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే మద్యం ఇంటికే వచ్చేస్తోంది' అన్నారు.
చంద్రబాబు పాలనలో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో కానీ, మద్యం షాపులు మాత్రం ఉన్నాయని జగన్ వ్యంగ్యంగా అన్నారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బయటకు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు వారిని కూడా మోసం చేశారని విమర్శించారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలన్నారని, జాబు రావాలంటే బాబు రావాలన్నారని, మరి అవన్నీ వచ్చాయా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అన్ని కులాల వారికి ఎన్నో హామీలు ఇచ్చి వారంరినీ మోసం చేశారని తెలిపారు.
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపర్చాలని, అది తన ఒక్కడి వల్లే సాధ్యమయ్యే పని కాదని, అందుకు ప్రజల తోడు కావాలని జగన్ అన్నారు. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయతీ అన్న పదాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మరోసారి వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, ఆ మాటలు నమ్మొద్దని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రతి ఓటుకి రూ.3 వేలు ఇస్తారని, వద్దని చెప్పొద్దని, వీలైతే రూ.5 వేలు లాగాలని సూచించారు. ఎందుకుకంటే అదంతా ప్రజల డబ్బేనని అన్నారు. అయితే, ఓటు మాత్రం చంద్రబాబుకు వేయొద్దని చెప్పారు.