Team India: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సరికొత్త రికార్డు.. సిరీస్ భారత్ కైవసం!
- ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ
- కెరీర్లో 17వ సెంచరీ నమోదు
- బంతితో నిప్పులు చెరిగిన కుల్దీప్ యాదవ్
- దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న భారత్
దక్షిణాఫ్రికా గడ్డపై భారతజట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఈసారి బ్యాట్ ఝళిపించడంతో పాటు లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బంతితో నిప్పులు చెరగడంతో భారత్ చారిత్రక విజయాన్ని అందుకుంది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. మంగళవారం పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1తో చేజిక్కించుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రోహిత్ శర్మ విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. 126 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి కెరీర్లో 17వ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఏ ఫార్మాట్లోనైనా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
భారత్ నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. హషీం ఆమ్లా (71), కెప్టెన్ మార్క్రమ్ (32) లు కలిసి నిదానంగా ఆడారు. భాగస్వామ్యం అర్ధ సెంచరీ దాటిన తర్వాత బుమ్రా వేసిన పదో ఓవర్ నాలుగో బంతికి మార్క్రమ్ అవుటయ్యాడు. ఇక ఆ తర్వాతి నుంచి దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆమ్లా క్రీజులో పాతుకుపోయినా మిగతా వారు అతడికి సహకరించడంలో విఫలమయ్యారు.
భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యాల బంతులకు క్రీజులో కుదురుకోలేక వికెట్లను సమర్పించుకున్నారు. డేవిడ్ మిల్లర్ (36), వికెట్ కీపర్ క్లాసెన్ (39) తప్ప మరెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. ఫలితంగా 42.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై 74 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసుకోగా, పాండ్యా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి సెంచరీ సాధించాడు. అయితే నిదానంగా ఆడుతున్న కెప్టెన్ కోహ్లీని మాత్రం మరోసారి కన్ఫ్యూజ్ చేసి రనౌట్ చేశాడు. రోహిత్ కారణంగా కోహ్లీ రనౌట్ కావడం ఇది ఏడోసారి. ఇక భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధవన్ (34), కోహ్లీ (36), శ్రేయాస్ అయ్యర్ (30) తప్ప మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు.
హార్దిక్ పాండ్యా గోల్డెన్ డక్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగిసాని ఎంగిడి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రబడకు ఓ వికెట్ దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఆరో వన్డే ఈనెల 16న సెంచూరియన్‌లో జరగనుంది. ఈ విజయంతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌కు ముందు 119 పాయింట్లతో ఉన్న టీమిండియా విజయం తర్వాత 122 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకోగా, 121 పాయింట్లతో ఉన్న సౌతాఫ్రికా 118 పాయింట్లకు పడిపోయి మూడోస్థానానికి పరిమితమైంది.