Hyderabad: తీరిన మెట్రో మోజు.. ఖాళీగా తిరుగుతున్న మెట్రో రైలు!
- ప్రయాణికులు బ్యాక్ టు సిటీ బస్
- చార్జీలు భరించలేకపోతున్న బడుగు జీవి
- మెట్రో తీరుపై విరుచుకుపడుతున్న ప్రయాణికులు
- త్వరలోనే మెట్రో మాల్స్ ప్రారంభం
భాగ్యనగర వాసులకు మొహం మొత్తింది. రెండున్నర నెలలకే మెట్రో మోజు తీరిపోయింది. భరించలేని టికెట్ ధరలతో క్రమంగా మెట్రో రైలుకు ముఖం చాటేశారు. ఫలితంగా రైళ్లు ఖాళీగా అటూఇటూ తిరుగుతున్నాయి. మెట్రో రైలు ప్రారంభంలో కిటకిటలాడిన స్టేషన్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నాగోలు నుంచి మియాపూర్ వరకు ఎక్కడ చూసినా ప్రయాణికులు అరకొరగానే కనిపిస్తున్నారు. ప్రయాణికులు మెట్రోకు దూరమవుతుండడంతో అది ఉద్యోగుల వేటుకు కారణమవుతోంది. ఇటీవల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు.
తొలుత మెట్రోలో ప్రయాణించేందుకు ఉత్సాహం చూపిన ప్రయాణికులు ఇప్పుడు ‘బాబోయ్’ అంటున్నారు. చార్జీలతో జేబు గుల్ల అవుతుండడమే అందుకు కారణం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది నిత్యం ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు మూడు నెలలు గడుస్తున్నా రోజువారీ, నెలవారీ పాస్‌ల ఊసెత్తకపోవడం కూడా మరో కారణం. ఈ కారణంగానే ప్రయాణికులు తిరిగి సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
దీనికి తోడు పార్కింగ్ సమస్య కూడా పెద్ద తలనొప్పిగా మారింది. సరైన పార్కింగ్ వసతి లేకపోవడంతో ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడే తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. పోలీసులు వీటిని తీసుకెళ్లి చలానాలు రాస్తున్నారు. దీంతో లబోదిబోమంటూ చలనాకట్టి వాహనాలను విడిపించుకుంటున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మెట్రో వైపు చూడడం మానేస్తున్నారు.
ఇక ప్రయాణికుల చార్జీలు తగ్గించి వారిని ఆకర్షించే ప్రయత్నాలకు దూరంగా ఉంటున్న మెట్రో అధికారులు అదనపు ఆదాయంపైనా దృష్టిసారించారు. ప్రకటనల ద్వారా ఇప్పటికే దండిగా ఆదాయం వస్తోంది. ఇప్పుడు మాల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, మలక్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో 4 మాల్స్ నిర్మించారు. వీటి ద్వారా లక్షలాది రూపాయల ఆదాయాన్ని మెట్రో ఆర్జించనుంది. దీనికి తోడు 2500 మెట్రో పిల్లర్లపై ప్రకటనల ద్వారా మరింత ఆదాయం చేకూరనుంది.
ఇంత పెద్దమొత్తంలో ఆదాయం వస్తున్నా చార్జీల పేరుతో ప్రయాణికుల ముక్కుపిండి మరీ పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తుండడంతో మెట్రోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్ముందు ధరలు తగ్గించకుంటే మెట్రోను ఖాళీగా నడుపుకోవాల్సిందేనని చెబుతున్నారు.