EYE WORMS: మహిళ కంట్లో పురుగులు.. వెలికి తీసిన అమెరికా వైద్యులు!
- మహిళ కంట్లో అరుదైన పరాన్నజీవి
- అరంగుళం పొడవున్న 14 పురుగుల వెలికితీత
- ‘దిలాజియా గులోసా’ జాతికి చెందినవిగా గుర్తింపు
అమెరికా మహిళ కంటిలో అరుదైన పురుగులను వైద్యులు గుర్తించారు. దిలాజియా గులోసా అనే పరాన్నజీవిగా దీనిని పేర్కొన్నారు. ఈ పురుగులు ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లలో బతికేస్తుంటాయి. వీటిని తాజాగా ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించిన వైద్యులు మొత్తం 14 పురుగులను బయటకు తీశారు. ఒక్కోటి అర అంగుళం పొడవుంది. ఈగలు, గబ్బిలాల ద్వారా ఇవి సంక్రమిస్తాయని వైద్యులు తెలిపారు. సాధారణంగా ఈ జాతి క్రిములు రెండు రకాలు మాత్రమే మనుషులకు సంక్రమిస్తాయని తెలుసని, తాజా ఘటనతో మూడో రకం కూడా మానవులకు చేరిందని పేర్కొన్నారు.
సదరు మహిళ చేపల వేటకు నదికి వెళ్లినప్పుడు ఈగ ద్వారా ఆ పురుగులు ఆమె కంట్లోకి ప్రవేశించి ఉంటాయని వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం ప్రొఫెసర్ రిచర్డ్ బ్రాడ్‌బరీ తెలిపారు. ఈ పురుగులు కంట్లో చేరిన మొదట్లో కన్ను మండుతుందని, దురద వస్తుందని చెప్పారు. ఈ కారణాలతో మహిళ తమ వద్దకు వచ్చినప్పుడు క్రిములను గుర్తించి బయటకు తీసినట్టు ఆయన వివరించారు.