Andhra Pradesh: ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి త్యాగం చేయలేదు: చంద్రబాబుతో భేటీ తరువాత సోమిరెడ్డి
- చంద్రబాబు మీద ఎటువంటి కేసులూ లేవు
- జగన్ పై మాత్రమే ఉన్నాయి
- మాకు ఎటువంటి భయం లేదు
- రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాం
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికి 29 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు చంద్రబాబుతో మంత్రులు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో తమ పార్టీ ఎంపీలు పోరాడుతున్నారని చెప్పారు.
టీడీపీ ఎంపీలు పోరాడిన తీరు అందరూ చూశారని, తమాషా ఏంటంటే వైసీపీ మాత్రం టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం గురించి, మోదీని గురించి ఒక్క మాట మాట్లాడలేదని సోమిరెడ్డి అన్నారు. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చెప్పారని, ఆయన 2016, 2017లోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేశారని తెలిపారు. ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెడతారని, లోక్సభ జరిగేటప్పుడు రాజీనామా చేసే ధైర్యం జగన్ కు లేదని, ఏప్రిల్ 6న సమావేశాలు ముగిసిన తరువాత చేస్తారట అని విమర్శించారు.
చంద్రబాబు నాయుడి మీద ఎటువంటి కేసులూ లేవని, కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. జగన్ పై మాత్రమే కేసులు ఉన్నాయని విమర్శించారు. సుజనా చౌదరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. వైసీపీకి పోరాడే ధైర్యం లేదని, పోరాడుతోన్న సుజనా చౌదరిపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారని అన్నారు.
వైసీపీ నేతలు ప్రత్యేకహోదా అంటూ మళ్లీ మాట్లాడుతున్నారని, 2016 సెప్టెంబరు 8న రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటన చేశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ప్యాకేజీని ఒప్పుకున్నామని, అంతేకానీ, కేంద్ర ప్రభుత్వానికి తామేం ప్రత్యేక హోదాను త్యాగం చేయలేదని అన్నారు.