oppo: ఏఐ టెక్నాలజీతో ఒప్పో ఏ71 3జీబీ స్మార్ట్ ఫోన్ విడుదల... మరింత స్పష్టమైన చిత్రాలు
- దీని ధర రూ.9,990
- మరింత స్పష్టంగా చిత్రాలను తీస్తుందని కంపెనీ ప్రకటన
- 200కుపైగా ముఖ కవళికలను క్యాప్చర్ చేయగలదు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఏ71 (3జీబీ) మోడల్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో మెరుగుపరిచిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ టెక్నాలజీని వినియోగించినట్టు కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ.9,990. ఇందులోని ఏఐ బ్యూటీ ఫంక్షన్ 200కుపైగా ముఖ కవళికలను మరింత కచ్చితంగా క్యాప్చర్ చేయగలదని, ఈ మోడల్ తో సెల్ఫీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తాము మరింత వాటాను పెంచుకుంటామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
నూతన టెక్నాలజీ నాయిస్ ను తొలగిస్తుందని, దాంతో చిత్రాలు మరింత స్పష్టంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 5.2 అంగుళాల హెచ్ డీ స్క్రీన్, ఆండ్రాయిడ్ 7.1 వెర్షన్, 1.8 గిగాహెర్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ మోడల్ ఉంటుంది. అమేజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ప్లాట్ ఫామ్ ల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.