paruchuri gopalakrishna: అప్పటి నుంచి చనిపోయేంతవరకూ నూతన్ ప్రసాద్ మద్యం ముట్టుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ
- 'చలిచీమలు' నుంచే నూతన్ ప్రసాద్ తో పరిచయం
- మొదటిసారిగా విజయవాడలో ఆయనను కలిశాను
- ఆయన పేరును గురించి ప్రస్తావించాను
'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా ఈ సారి గోపాలకృష్ణ .. నూతన ప్రసాద్ గురించి ప్రస్తావించారు. ఆయనతో గల అనుబంధాన్ని గురించి గుర్తుచేసుకున్నారు. "నూతన ప్రసాద్ .. 'చలి చీమలు' సినిమా నుంచే మాకు పరిచయం .. అంతకుముందు పరిచయం లేదు. 'చలి చీమలు' సినిమాకు మా అన్నయ్యే ఎక్కువగా రాశారు. ఆ సినిమా రిలీజ్ అప్పుడు నేను ఉయ్యూరు నుంచి విజయవాడ వచ్చి చూశాను"
ఆ సమయంలో 'నూతన్ ప్రసాద్ అనే ఆర్టిస్ట్ వచ్చి నిన్ను కలుస్తాడు .. నువ్ విజయవాడలో ఉన్నట్టుగా నేను చెప్పాను .. ఆయనను కలిసి మాట్లాడు' అని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. హోటల్లో నేను .. నూతన ప్రసాద్ కలుసుకున్నాం. 'ఏంటి సార్ .. నూతన్ ప్రసాద్ గారు, మీ పేరు భలే విచిత్రంగా వుందే' అని అన్నాను.
'నా అసలు పేరు నూతన్ ప్రసాద్ కాదు .. ఇంతకు ముందు నాకు బాగా తాగుడు అలవాటు ఉండేది. తాగుడు అలవాటు నా కెరియర్ ను ఇబ్బంది పెడుతోంది. అందువలన తాగుడు మానేసి .. కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో పేరు మార్చుకున్నాను' అని చెప్పారు. అలా ఆయన డిసెంబర్ 18 .. 1977 నుంచి చనిపోయేంత వరకూ మద్యం ముట్టుకోలేదు. అది ఆయన గొప్పతనమని చెప్పక తప్పదు' అంటూ చెప్పుకొచ్చారు .