KCR: మా నిధులు మాగ్గావాలే: నేడు అరుణ్ జైట్లీని డిమాండ్ చేయనున్న కేసీఆర్
- బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం
- రావాల్సిన నిధులపై ఆర్థికమంత్రితో చర్చించనున్న కేసీఆర్
- ఆపై హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం
ఈ నెలారంభంలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు స్వయంగా అరుణ్ జైట్లీని కలిసి ఈ విషయమై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టులకు, కేంద్రం నిధుల రాబడి, కొత్త ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన సహకారం తదితర అంశాలపై జైట్లీతో కేసీఆర్ చర్చించనున్నారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా ఆదాయాన్ని పంపుతున్నప్పటికీ, కేంద్రం నుంచి అరకొర మాత్రమే వస్తున్నాయని భావిస్తున్న కేసీఆర్, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గట్టిగానే ఉండాలని భావిస్తున్నారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను ఆయన ముందుంచి సాధ్యమైనన్ని ఎక్కువ నిధులను రాబట్టడమే లక్ష్యంగా ఈ భేటీ సాగనుంది.
కాగా, గత నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం న్యూఢిల్లీ వెళ్లిన ఆయన, నేడు ఆర్థిక మంత్రితో భేటీ అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. నేడు హైదరాబాద్ కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ గౌరవార్థం జరిపే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.