akun sabharwal: టాలీవుడ్ ను వణికించిన అకున్ సబర్వాల్ పోస్టింగ్ పై సస్పెన్స్!

  • ఎక్సైజ్ డైరెక్టర్ గా డిప్యుటేషన్ పై ఉన్న అకున్
  • డిప్యుటేషన్ పదవీకాలం పూర్తి
  • మాతృశాఖకు పంపాలంటూ ఎక్సైజ్ శాఖకు డీజీపీ లేఖ

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పోస్టింగ్ పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం డిప్యుటేషన్ పై ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న ఆయనను పోలీసు శాఖకు పంపాలంటూ ఎక్సైజ్ శాఖకు ఇటీవలే డీజీపీ మహేందర్ రెడ్డి లేఖ రాశారు. అయితే, ఆయన సేవలు ఇక్కడ ఎంతో అవసరమని, ఆయనను తమ శాఖలోనే కొనసాగించాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు అకున్ ను ఎక్కడ కొనసాగించాలనే విషయం తేలనుంది.

ఎక్సైజ్ డైరెక్టర్ గా అకున్ డిప్యుటేషన్ కాలపరిమితి పూర్తి అయిన నేపథ్యంలో... ఈ నెల 19వ తేదీ లోపు ఆయనను మాతృశాఖకు పంపాలని వారం క్రితం సోమేష్ కుమార్ కు డీజీపీ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, సీఎస్ కు సోమేష్ కుమార్ లేఖ రాశారు. ఎక్సైజ్ శాఖలో పని భారం ఎక్కువగా ఉందని... దీనికి తోడు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా తాను కొనసాగుతున్నానని లేఖలో సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయితే, తనపై పని భారం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కారణాల రీత్యా, అకున్ ను ఇక్కడే కొనసాగించాలని కోరారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీగా అకున్ ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ సూచనల మేరకే ఎక్సైజ్ శాఖకు డీజీపీ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News