Grahana Narabali: గ్రహణ నరబలి వెనకున్న అసలు నిజమిది... తేల్చేసిన పోలీసులు!
- హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కేసు
- బోయగూడ నుంచి చిన్నారి పాప అపహరణ
- బెడ్ రూములో రాజశేఖర్ దంపతుల నగ్న పూజలు
- సూర్యచంద్రుల కాంతి పడాలనే డాబాపై తల
సంపూర్ణ చంద్రగ్రహణం నాడు హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లో సంచలనం సృష్టించిన చిన్నారి గ్రహణ నరబలి కేసులో అసలు నిజాన్ని పోలీసులు తేల్చారు. ఈ కేసులో అనుకున్నట్టుగానే ఫోరెన్సిక్ నివేదిక కీలక ఆధారాలను అందించగా, దాని ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ చిన్నారి పాపను గ్రహణ నరబలి ఇచ్చారు. చనిపోయింది అమ్మాయని ల్యాబ్ రిపోర్టు వెల్లడించింది.
అయితే, అందరూ అనుకున్నట్టుగా వేరే రాష్ట్రం నుంచి పాపను తేలేదు. బోయిగూడ నుంచి పాపను తీసుకొచ్చారు. నరబలి చేసినట్టు ఇంటి యజమాని, పోలీసులు అనుమానిస్తున్న ప్రధాన నిందితుడు రాజశేఖర్ అంగీకరించాడు. బెడ్ రూములో నగ్నంగా పూజలు చేసిన రాజశేఖర్ దంపతులు, ఆపై పాపను అక్కడే బలిచ్చారు. బలి తరువాత పాప తలపై తొలుత చంద్రకాంతి, ఆపై సూర్యకాంతి పడాలని మంత్రగాళ్లు సూచించడంతో, తలను డాబాపై పడేశాడు రాజశేఖర్. ఆపై మొండాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో పడవేశారు. నరబలి తరువాత ఇంటిని రసాయనాలతో స్వయంగా శుభ్రం చేశారు రాజశేఖర్ దంపతులు. కేసులో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చామని, ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని వెల్లడించిన పోలీసులు, నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.